పరిచయము

  శ్రీరామ
   
  సనాతన సాధక సమష్టి  -  పరిచయము
   
  మహాశయా !  నమస్కారము !
   
  భారత దేశము సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ప్రతి ఒక్కరూ 
  సామాన్యముగా కోరుకునే సుఖసంతోషాలను, సామరస్యమును,
   స్థిరత్వమును, శాంతిని తరతరాలుగా శాశ్వత ప్రాతిపదికమీద 
  అందజేసే జీవన విధానము మన దేశములోను, తద్ద్వారా యావత్ 
  ప్రపంచములోను ఈ సనాతన ధర్మము వలన రూపు దిద్దుకొనినది.
   
  సశాస్త్రీయము, సర్వోత్కృష్టము అయిన ఈ సనాతన ధర్మము - 
  సనాతన జీవన విధానము – సనాతన జీవన వ్యవస్థలను గుఱించిన 
  సరియగు అవగాహన, ఆచరణలు నానాటికి లోపించి స్వేచ్ఛాచరణ, 
  అంతులేని స్వార్థములు ప్రబలినవి. వీటి కారణముగా ఈనాడు 
  భ్రష్టాచరణ, ఉగ్రవాదము, అరాచకము, అవ్యవస్థలు ఏర్పడి
  సుఖశాంతులు లోపించుచున్నవి. మంచితనము, మంచివాళ్ళ బలము 
  తగ్గుచున్నవి. చెడుతనము, చెడువాళ్ళ బలము పెరుగుచున్నవి. 
  గృహస్థులకు జీవితము రాను రాను దుర్భరముగా మారుచున్నది. 
   
  మారిన ఈనాటి పరిస్థితులలో, అనగా నేటి ప్రజారాజ్య వ్యవస్థలో, 
  ఈ దుఃస్థితిని చక్కదిద్ద వలసిన బాధ్యత ప్రభుత్వముమీదనే కాక 
  సమాజము లోని అందరు వ్యక్తులమీద కూడా యున్నది.
  ఈ దిశలో ఆలోచించు ఆధునికులు కొందరు – ముఖ్యముగా 
  భౌతికముగా అభివృద్ధి చెందిన దేశములలోని జీవనశైలిని ఆదర్శముగా 
  భావించువారు – నేటి ఆచరణకు సనాతన ధర్మము యోగ్యము 
  కానిదిగా తలచుచున్నారు. కాని సనాతనం అనగా సదాతనం, శాశ్వతం
  అనియు, ఎల్ల వేళలా వర్తించునది అనియూ  అర్థము. 
   
  సామాజిక దుఃస్థితికి పరిష్కారములు - 
  భౌతిక విలువలపై ఆధారపడిన పాశ్చాత్య సభ్యత, జీవన విలువలకన్న,
  మానవతా విలువలను రక్షించు ఆధ్యాత్మిక విలువల పైన
  ఆధారపడిన సనాతన సభ్యత, జీవన వ్యవస్థలలో కలవు. దీనికి 
  ఆధునిక పరిస్థితులలో సనాతనము యొక్క ఆవశ్యకతను, 
  ప్రయోజనములను గుర్తించ వలసిన అవసరము ఉన్నది.
   
  వ్యక్తులు బాగున్నదానికన్నా,  సమాజము బాగున్నప్పుడే అందరికీ 
  మేలు జరుగుతుంది. మనిషికి స్వార్థం సహజం. ఎవరి బాగు వరకే 
  వారు చూసుకుంటూంటే, సమాజం బాగు చూసేవారు ఎవరు? అందుకే, 
  విశాల హితం కోరేవారు కొందరైనా మార్గనిర్దేశనం చేస్తూంటే, 
  సమాజహితం కోసం స్వార్థాన్ని పరిమితులలో నుంచుకుని, ఉదార 
  భావాలతో ఉంటూ, ” మానవ సేవయే మాధవ సేవ ! ” అని ఆచరణలో 
  పెట్టే సజ్జనుల అవసరం ఏ సమాజానికైనా ఉండితీరుతుంది. మన 
  అదృష్టం ఏమిటంటే – మన సమాజ నిర్మాతలైన మహర్షుల దూరదృష్టి
  వలన, మన భారతీయ సమాజంలో అట్టి సజ్జనుల సంఖ్య బహుళంగా 
  ( లక్షలూ, కోట్లలో ) ఉంటూ వచ్చింది. పాశ్చాత్య వ్యామోహం వల్ల 
  దృష్టికోణంలో వస్తూన్న మార్పుల వలన, సంకుచిత స్వార్థం పెరుగుతూ, 
  సమాజ విముఖతకు లోనయ్యే సామాన్య జనుల సంఖ్య పెరిగిపోతోంది !
   
  సమాజ విముఖతకు లోనుకాకుండా, మానవ శ్రేయస్సుతో పాటు 
  ” ఈ భారత దేశము నాది ! భారతీయులందరూ నా వావాళ్ళు !
  ఈ దేశ సంస్కృతీ ధర్మములను రక్షించటం నా బాధ్యత ! ఈ వారసత్వ 
  సంస్కృతీ సంపద తరతరాలకూ అవిచ్ఛిన్నంగా వర్ధిల్లుతూనే ఉండాలి !
  మనమంతా కలిసి మెలిసి బ్రతకాలి ! ” అనే భావన పెరగాలి.
  ( The   WILL TO LIVE TOGETHER  must percolate
  to more people.) ఇటువంటి ఆలోచనలను, ఆచరణలను అందరిలో 
  పెంపొందించాలి. ఇది సమాజ శ్రేయస్సుకూ, మానవాళి శ్రేయస్సుకూ, 
  మనుగడకూ అత్యవసరము. ఈ లక్ష్య సాధనకై, ” సనాతన సాధక 
  సమష్టి ” ఉద్యమము 1956 వ సం.లోప్రారంభింప బడినది.
   
  ఈ ఉద్యమములో క్రొత్తగా తెచ్చుకొనవలసిన గురు – శిష్య సంబంధాలు 
  లేవు. సభ్యత్వ రుసుములు, చందాలు, అధ్యక్షుడు, కార్యదర్శి ఇత్యాది 
  పదవులూ లేవు. కావలసినదల్లా – తమ చేయూత, స్వచ్ఛంద 
  సహకారములు మాత్రమే ! మన దేశములో ఈ ఉద్యమము అనేక 
  ఊళ్ళలో కొనసాగుచున్నది. 
   
  పరస్పర సదవగాహనకై, ఇట్టి ఉద్దేశ్యములు కలిగిన వ్యక్తులు 
  తమతమ ఊళ్ళలో/ పేటలలో వారమునకు ఒకసారి ఒక గంటసేపు 
  సమావేశ మగుట ప్రధాన విషయము.
  సమష్టిని పెంచుట, సంతతి శ్రేయస్సు, పురుషార్థ సాధన, సర్వాంగీణ 
  జీవన వ్యవస్థ, సనాతన ధర్మ సంరక్షణ, సనాతన సంప్రదాయ పరిరక్షణ, 
  సనాతన సమాజ రక్షణ, లోకసంగ్రహ ఆదర్శం మొదలగు
  విషయములను గూర్చియూ, జీవిత సమస్యలను గూర్చియూ, 
  విచారవిమర్శలూ, విచార వినిమయములూ ఈ సమావేశములలో 
  జరుగును. సముచితమైన నిర్ణయములకు కార్యరూపము నిచ్చుటకై 
  సాధన జరుగును.దానికిగాను అంశత్రయ కార్యక్రమమును 
  ( 3 – Point Programme ) తీసుకున్నాము.
   
  ఈ సమావేశములలో తమరుకూడా పాల్గొని, 
  చేయూత నీయవలసినదిగా ప్రార్థన !
   
  ఇట్లు,
   
  సనాతన సాధక సమష్టి.
   
   

టాగులు:

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.