ఈ ” సనాతన సాధక సమష్టి ” ఉద్యమం గురించి :

  శ్రీరామ
   
  ఈ ” సనాతన సాధక సమష్టి ” ఉద్యమం గురించి :
   
1) సనాతన :
   
  సనాతనం అనేది ఒక మతం కాదు. అది ఒక ధర్మం ! 
  అభ్యుదయ కరమైన ఒక శాంతియుత సహ-జీవన విధానం !
  మన నిత్య జీవితంలో, దినచర్యలో, వ్యవహార సరళిలో, 
  మానసిక దృక్పథంలో నిక్షేపించబడి – తరతరాలుగా మన 
  జన జీవన స్రవంతిగా వస్తూ ఉన్నది ఈ సనాతన ధర్మం.
   
  మారుమూల కుగ్రామంలో నున్న నిరక్షరాస్యులు కూడ – 
  స్త్రీ పురుష భేదం లేకుండా – ఏది ధర్మమో ఏది న్యాయమో
  చెప్ప గలిగేంతగా మన జాతి సంస్కృతిలో జీర్ణించి పోయింది
  ఈ సనాతన ధర్మం ! 
   
  ఇట్టి సనాతన జీవన విధానపు మూలాలు
  వేదమూలకమైన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి ! అందుకే
  వాటిని గురించిన అవగాహన కలిగించటం మన మొదటి ప్రక్రియ !
   
2) సాధక :
   
  విన్న మంచిని ఆచరణలో పెట్టేందుకు 
  చిత్తశుద్ధితో ప్రయత్నించేవారే సాధకులు.
   
  ” ఈ రోజులలో ఈ భావాలు ఆచరణ-యోగ్యములా ?  
  ఆచరణ-సాధ్యములా? ఏ స్థాయి వారికి ఏ సాధనలు చెప్పబడ్డాయి ?” 
  అనే ఆశంకలకు సమాధానం దొరికితే, సాధకులకు చాలా 
  ఉపయోగకరంగా ఉంటుంది గదా !
   
  అందుకే, సాధనా మార్గంలో సోపానక్రమం చూపించటానికి
  ప్రయత్నించటం మన రెండవ ప్రక్రియ !
   
3) సమష్టి :
   
  నేటికాలంలో అతి వేగంగా మానవ జీవన విలువలు అంతరిస్తున్నాయి. 
  ఈ పతనక్రమం నుంచి జాతిని కాపాడి నిలబెట్టాలంటే –
  విడి విడి వ్యక్తుల మొత్తం శక్తి కన్న బలవత్తరమైన సంఘశక్తి, 
  సంఘజీవనం అవసరం. అందుకనే సమష్టి బృందాల నిర్మాణానికి 
  ప్రాముఖ్యం ఇవ్వటం మన కార్యక్రమం యొక్క విశిష్టత !
   
  వారానికి ఒక రోజు కలిసి కూర్చుని, మన సనాతన ధర్మానికి, 
  సంస్కృతికి, జాతికి, దేశానికి, సమాజానికి మనం ఏవిధంగా సేవ 
  చేయగలం? వచ్చే అడ్డంకులని ఏ విధంగా దాటే ప్రయత్నం 
  చేయవచ్చు ? ఎవరం ఏవిధంగా ప్రయత్నం చేస్తున్నాం, 
  సాధక బాధకాలేమిటి?  అని –
   
  సమస్యలను, వాటి మూల కారణాలను, వాటికి పరిష్కార మార్గాలను
  చర్చిస్తూ, ఆచరణ శీలమైన పరస్పర ప్రబోధక ప్రచోదక వాతావరణాన్ని
  కల్పించుకోవటమే – మన సనాతన సాధక సమష్టి యొక్క 
  మూడవ ప్రక్రియ ! 
   

ట్యాగులు: , ,

ఒక స్పందన to “ఈ ” సనాతన సాధక సమష్టి ” ఉద్యమం గురించి :”

  1. శ్రీవాసుకి Says:

    మీ ప్రయత్నం అభినందనీయం.

వ్యాఖ్యానించండి